కార్యక్రమాలు

అనువాదంపైన విద్యయిక చర్చలు నిర్వహించడానికి, భారతీయ భాషలలో ఇప్పటికే అనువాదం చేసి ఉన్న జ్ఞాన పుస్తకాలను మదింపు చేయడానికి, సమాచారవ్యాప్తికి జాతీయ అనువాద సమితి కార్యగోష్ఠులు, సదస్సులు, శిక్షణా కార్యక్రమాలు, కొత్తగా అనువాదం నేర్చుకునేవారికి అనువాదంలో తర్ఫీదులు నిర్వహిస్తుంది. పరస్పర చర్చలకు నిపుణులను, పరిశోధక విద్యార్ధులను అనువాదకులను జాఅస కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆహ్వానిస్తుంది.
 
కార్యగోష్ఠులు
22 భారతీయ భాషలలో ప్రతి శాస్త్రంలోనూ పుస్తక ప్రత్యేకిత పారిభాషిక పదకోశాలను సిద్ధం చేయడానికి సంపాదకీయ సహాయక వర్గ సభ్యుల విధుల నిర్వహణకు జాతీయ అనువాద సమితి కార్యగోష్ఠులు నిర్వహిస్తుంది. ఒక పుస్తక అనువాదం పూర్తయిన వెంటనే ప్రతి భాషకు ఉన్న సంపాదకీయ సహాయక వర్గ నిపుణులు సంపాదకీయ సహాయక వర్గం సూచించిన నిపుణులు ఒక కార్యగోష్ఠిలో కలిసి రాతప్రతిని సమీక్షించడంలో, అనువాదకులకు మార్గదర్శకం చేయడంలో సహాయపడతారు.
 
సదస్సులు
అనువాద విద్యయిక విషయ వినిమయాన్ని ప్రోత్సహించడానికి జాతీయ అనువాద సమితి సదస్సులు నిర్వహిస్తుంది. సదస్సులలో సమర్పించిన పరిశోధనాత్మక వ్యాసాలను సమీక్షించి భాండాగారంలో నిక్షిప్తం చేసి ఉంచుతుంది. వాటిని ఆయా సమయాలలో జాఅస ప్రచురించే “ట్రాన్సలేషన్ టుడే” ద్వివార్షిక పత్రికలో అచ్చు వేయడం జరుగుతుంది. ఈ సదస్సులు జాఅసకి అనువాదంపైన విద్యయిక చర్చలను ఒక భాండాగారంగా నిక్షిప్తం చేయడానికి సహాయపడతాయి. ఈ చర్చలు అనువాద అధ్యయనాలు, సంబంధిత విభాగాలలో అభిరుచి గల వారికి (ముఖ్యంగా అనువాద విద్యార్దులు, పరిశోధక విద్యార్దులకు) సహాయపడవచ్చు.
 
శిక్షణా కార్యక్రమాలు
జాతీయ అనువాద సమితి వివిధ భాషలలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి, అనువాద శిక్షణా కార్యక్రమాలలో పాల్గొన్నవారికి అనువాదం, అనువాద సిద్ధాంతాలు, జ్ఞాన పుస్తక అనువాదాలలో ఎదురయ్యే రకరకాల సమస్యల గురించి తెలియజేస్తుంది. ఈ కార్యక్రమాలలో పాల్గొన్నవారికి అనువాద ఉపకరణాలను పరిచయం చేయటంతోపాటు వారిని సమర్థవంతమైన అనువాదకులుగా తయారుచేయడానికి ప్రయత్నిస్తుంది. భిన్నకళాశాలల, విశ్వ విద్యాలయాలకు చెందిన విద్యార్దులు, పరిశోధక విద్యార్దులు ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు. వీళ్లు విభిన్న భాషల, శాస్త్రవిషయ నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లు. కళాశాల, పాఠశాల ఉపాధ్యాయులు, స్వతంత్ర అనువాదకులు, అనేక రకాల వృత్తుల వాళ్లు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమాలలో పాల్గొనేవారిని నేష్నల్ రిజిష్టర్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ సమాచారనిధి నుంచి కూడా ఎంపిక చేయడం జరుగుతుంది.

అనువాద అధ్యయనాలు, దాని అనుబంధ శాస్త్ర విషయాలు భారతీయ భాషలలో జ్ఞాన పుస్తకాలను క్రమంగా అచ్చువేస్తున్న భారతీయ భాషల రచయితలను ఈ కార్యక్రమాలకు వనరు వ్యక్తులుగా ఆహ్వానించడం జరుగుతుంది. జ్ఞాన పుస్తకాలను అనువాదం చేస్తున్న నిపుణులు మరియు భారతదేశంలో వివిధ భాషలలో సాంకేతిక పారిభాషిక పదకోశాల అభివృద్ధిలో నిమగ్నమైన వారు కూడా జాఅసకి వనరు వ్యక్తులుగా వ్యవహరించవచ్చు.
 
ఇతర కార్యక్రమాలు
జాఅస కార్యకలాపాల అవగాహన పెంపొందించటానికి దేశవ్యాప్తంగా జరిగే పుస్తక ప్రదర్శనలలో పాల్గొంటుంది. అనువాదం చేసిన పుస్తకాల అచ్చు పూర్తయిన వెంటనే జాఅస రచయితల సమావేశం, అనువాదకుల సమావేశం మొ. ప్రచార కార్యక్రమాలను కూడా చేపడుతుంది.